సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఇప్పటి వరకు కలిసి ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నారు. దివంగత కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్‌ను.. కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో సత్కరించనుంది. ప్రతి ఏడాది నవంబర్ 1న కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
‘కన్నడ రాజ్యోత్సవ’ పేరుతో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ ఏడాది పునీత్‌కు ‘కర్ణాటక రత్న’ పురస్కారం ఇవ్వనున్నారు. అందుకే ఈ సారి కర్ణాటక ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నారు. ఈ క్రమంలో సౌత్ నుంచి ఇద్దరు బిగ్ స్టార్స్ ఈ వేడుకకు రాబోతున్నారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అహ్వానం అందింది.
దాంతో రజనీకాంత్‌తో కలిసి ఎన్టీఆర్ వేదిక పంచుకోనుండడం ఆసక్తిగా మారింది. ఇక ఎన్టీఆర్‌కు పునీత్ ఫ్యామిలీకి దశాబ్దాలుగా మంచి రిలేషన్ ఉంది. ఎన్టీఆర్ అంటే పునీత్‌కు ఎంతో అభిమానం. పలు సందర్భాల్లో తారక్‌ను తన సోదరుడిగా పేర్కొన్నాడు పునీత్. అంతేకాదు గతంలో పునీత్ ‘చక్రవ్యూహ’ సినిమాలో ‘గెలియా గెలియా’ అనే పాటను కూడా పాడాడు తారక్. దాంతో పునీత్ ఆకస్మిక మరణంతో చాలా ఎమోషనల్ అయ్యాడు ఎన్టీఆర్. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలోనే యంగ్ టైగర్‌కు ఈ ప్రత్యేక ఆహ్వానం అందిందని చెప్పొచ్చు.