»Manchu Lakshmi Teach For Change Adoption Of 30 Schools
Manchu Lakshmi: మంచు లక్ష్మీ ‘టీచ్ ఫర్ ఛేంజ్’.. 30 స్కూళ్ల దత్తత
మోహన్ బాబు గారాల పట్టీ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఎన్నో షోలు చేసింది లక్ష్మీ. అలాగే సమాజ సేవ కోసం తన వంతు ప్రయత్నంగా ఏదో ఓ విధంగా సాయం చేస్తునే ఉంటుంది. తాజాగా.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించడం కోసం.. 30 ప్రభుత్వ పాఠశాలల దత్తత తీసుకుంది మంచు లక్ష్మీ.
మంచు లక్ష్మీ(Manchu Lakshmi) 2014లో టీచ్ ఫర్ ఛేంజ్‌ను స్థాపించి.. ప్రభుత్వ పాఠశాలలో విద్య నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పాఠశాల(Government Schools)ల్లో చదివే వివిధ కమ్యూనిటీలకు చెందిన చిన్నారుల్లో అక్షరాస్యత నైపుణ్యాలను మెరుగుపర్చడానికి ఈ ఎన్జీవో(NGO) పని చేస్తుంది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన వాలంటీర్లు ఎన్జీవో ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు విద్యను బోధిస్తారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లలో చురుగ్గా ఉన్నఈ సంస్థ.. ముంబై, ఢిల్లీ, లక్నో, చెన్నైలకు కూడా తన కార్యకలాపాలను విస్తరించింది.
ప్రస్తుతం 248 ప్రభుత్వ పాఠశాలల(Government Schools)లో చదువుతున్న 42,080 మంది విద్యార్థులు(Students) ఈ సంస్థ నుంచి లబ్దిపొందుతున్నారు. గతేడాది యాదాద్రి భువనగిరి జిల్లాలో 56 పాఠశాలలను దత్తత తీసుకున్న లక్ష్మీ(Manchu Lakshmi).. ఈ ఏడాది టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా.. గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలల దత్తత తీసుకుంది మంచు లక్ష్మీ. ఈ సందర్భంగా గద్వాలలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో మంచు లక్ష్మి సమావేశమయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య, కంప్యూటర్ క్లాస్ తదితర మౌళిక వసతులు కల్పించనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే ఆయా పాఠశాలలకు డిజిటల్ బోధన కోసం మెటీరియల్ సిద్ధం చేసినట్లు తెలిపింది. టీవీ, వాల్‌పేయింటింగ్, కార్పెట్స్, బోధన సామగ్రి సమకూరుస్తామన్నారు. ఇదిలా ఉంటే.. అప్పుడెప్పుడో అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్‌గా నటించిన లక్ష్మీ(Manchu Lakshmi).. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అగ్ని నక్షత్రం అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది.