Type 2 Diabetes: రాత్రిపూట మెలకువగా ఉండే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం.. పరిశోధనలో వెల్లడి
హార్వర్డ్ మెడిసిన్ స్కూల్ పరిశోధకులు 60 వేల మంది మహిళా నర్సులపై అధ్యయనం చేశారు. రాత్రిపూట పనిచేసే నర్సులు తక్కువ వ్యాయామం చేయగలుగుతున్నారని, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారని అధ్యయనం వెల్లడించింది.
Type 2 Diabetes: బిజీ లైఫ్ స్టైల్, పనుల కారణంగా చాలా మంది సరిగా నిద్ర పోవడం మానేశారు. దీని ప్రభావం వారి ఆరోగ్యం పై కనిపిస్తోంది. ఈరోజుల్లో ఆధునిక జీవనశైలి పేరుతో రాత్రి పొద్దుపోయే వరకు మెలకువగా ఉంటున్నారు. ఈ అలవాటు మిమ్మల్ని వ్యాధులకు గురి చేస్తుంది. తాజాగా దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.. రాత్రి పొద్దుపోయే వరకు మెలకువగా ఉండే వారికి టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఇతర వ్యక్తులతో పోలిస్తే అర్థరాత్రి వరకు మెలకువగా ఉండే వ్యక్తులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిశోధన అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడింది.
పరిశోధనలో ఏం బయటపడింది
హార్వర్డ్ మెడిసిన్ స్కూల్ పరిశోధకులు 60 వేల మంది మహిళా నర్సులపై అధ్యయనం చేశారు. రాత్రిపూట పనిచేసే నర్సులు తక్కువ వ్యాయామం చేయగలుగుతున్నారని, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారని అధ్యయనం వెల్లడించింది. ఇది వారి జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపింది. పగటిపూట పనిచేసే వారితో పోలిస్తే రాత్రిపూట మేల్కొని పనిచేసే వ్యక్తులకు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 19 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి, పగటిపూట నిద్రపోయే వారి స్లీపింగ్ సైకిల్ చెదిరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీని కారణంగా శరీరంలోని జీవక్రియ వ్యవస్థ క్షీణిస్తుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి టైప్ 2 డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. పరిశోధనలో, శాస్త్రవేత్తలు రాత్రి ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తుల, తెల్లవారుజామున నిద్రపోయే వ్యక్తుల కొవ్వు జీవక్రియలో చాలా తేడా ఉందని కనుగొన్నారు.
టైప్ 2 డయాబెటిస్ అంటే ఏమిటి?
డయాబెటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి – టైప్ 1, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 మధుమేహం చాలా మందిలో జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది . టైప్ 2 మధుమేహం ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో అవాంతరాల వల్ల వస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో, ప్యాంక్రియాస్ అవసరానికి అనుగుణంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకురావచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.