భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ సందేశాలు వచ్చాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు.
Vivek Ramaswamy: వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రక్రియ మొదలైంది. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రామస్వామికి గుర్తు తెలియని వ్యక్తులు నుంచి బెదిరింపులు వచ్చాయి. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ ప్రచారంలో భాగంగా రాబోయే ఈవెంట్ల సమాచారం గురించి ఓటర్లకు నోటిఫికేషన్లు పంపించారు. దీనికి వచ్చిన స్పందనల్లో ఓ వ్యక్తి వివేక్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. వచ్చే ఈవెంట్లు తనకు మంచి అవకాశాన్ని కల్పించనుందని.. ఇందులో పాల్గొన్న ప్రతీ ఒక్కరిని చంపేస్తానని సందేశం వచ్చింది.
విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. న్యూహాంప్‌షైర్‌లోని డోవర్ నుంచి సందేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. టైలర్ ఆండర్సన్ అనే వ్యక్తి బెదిరింపు సందేశాలు పంపినట్లు ఎఫ్‌బీఐ అఫిడవిట్లో వెల్లడించారు. నిందితుడిపై నేరం రుజువైతే.. అయిదేళ్లు జైలు శిక్షతోపాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బెదిరింపు సందేశాలకు పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసినందుకు దర్యాప్తు సంస్థలకు వివేక్ కృతజ్ఞతలు తెలిపారు. తనతో ఉండి రక్షించిన బృందాలకు ధన్యవాదాలు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. తర్వాతి స్థానంలో వివేక్ రామస్వామి నిలిచారు.