USA: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అనుకూల వైఖరి తీసుకుందనే విమర్శలకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వివరణ ఇచ్చారు. మేం ఎవరికీ కూడా అనుకూలం కాదని.. ప్రతి ఒక్కరిని చట్టప్రకారం సమానంగా చూడాలని, మానవ హక్కలు విషయంలోనే మాట్లాడతామని పేర్కొన్నారు. మాథ్యూ మిల్లర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విషయంలో మాట్లాడతారు కానీ, పాక్‌లో ప్రతిపక్ష నేతల అరెస్టులపై మాత్రం మౌనంగా ఉంటారనే విమర్శలొచ్చాయి. ఈ విషయాన్ని ఓ జర్నలిస్టు ఆయన వద్ద ప్రస్తావించారు. దీంతో మాథ్యూ స్పందిస్తూ నేను దానిని అంగీకరించను. పాకిస్థాన్‌లో ప్రతి ఒక్కరిని చట్టప్రకారమే చూడాలని, వారి మానవహక్కులను గౌరవించాలని చాలాసార్లు చెప్పాము. అదే వైఖరిని ప్రపంచంలోని అన్ని దేశాల విషయంలో అనుసరిస్తామని వివరణ ఇచ్చారు.
మార్చి 21వ తేదీన కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేసింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ఆశిస్తున్నామని తెలిపారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ.. ఇది పాత చెడు అలవాటు. దేశాల మధ్య మర్యాద అనేది ఉండాలి. మనవి సార్వభౌమత్వం ఉన్న దేశాలు. మనం ఒకరి అంతర్గత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. ఒక దేశ రాజకీయాలపై మరొకరు వ్యాఖ్యలు చేయకూడదు. అందుకే వీటిపై మా అభ్యంతరాలను ఆయా దేశాల దౌత్యవేత్తలకు బలంగా చెప్పామని అన్నారు.