»Us Elections Trump Says He Would Give Green Cards To All Foreign College Students At Graduation
Trump : గ్రాడ్యుయేట్ అయిన వెంటనే యూఎస్ గ్రీన్ కార్డు ఇస్తామంటున్న ట్రంప్!
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తన వాస్తవ తీరుకు భిన్నంగా గ్రీన్ కార్డుల విషయంలో కీలక ప్రకటన చేశారు. ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే..?
US Elections: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్(donald Trump) గ్రీన్ కార్డుల జారీ విషయంలో కీలక ప్రకటన చేశారు. ఎప్పుడూ అమెరికన్లకే అవకాశాలు, ఉద్యోగాలు అంటూ చెప్పే ఆయన ఈ సారి తన పంథాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అనూహ్యమైన ప్రతిపాదనను ఆయన తెరముందుకు తీసుకొచ్చారు. విదేశీ వలస విధానాలపై ఇంటర్య్వూలో అడిగిన ఓ ప్రశ్నకు గాను ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.
అమెరికన్ కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్లు కాగానే విదేశీ విద్యార్థలు(foreign students) అమెరికాలో ఉండేందుకు వీలుగా డిప్లొమా, గ్రీన్ కార్డులు ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. జూనియర్ కాలేజీల విషయంలోనూ ఈ విధానం అమలుపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్లు, నాలుగేళ్ల చదవులతో సంబంధం లేకుండా గ్రీన్ కార్డుల(Green Cards) జారీ ప్రక్రియ ఉంటే బాగుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ విషయం పై దృష్టి పెడతానని తెలిపారు. వీసా సమస్యల వల్లే చైనా, భారత్‌లాంటి దేశాల నుంచి వస్తున్న ప్రతిభావంతులు అమెరికాలో ఉండలేక సొంత దేశాలకు వెళ్లిపోతున్నారన్నారు.
ట్రంప్(Trump) సాధారణంగా అమెరికా అనుసరిస్తున్న వలస విధానాలపై ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సైతం చట్టబద్ధంగా వచ్చిన వలసదారులపై ఆంక్షలు విధించారు. కుటుంబ వీశాలు, లాటరీల్లాంటి వాటిలో అనేక మార్పులు చేశారు. చాలా ట్యాలెంటెడ్ స్కిల్స్ ఉన్న వారికి మాత్రమే బిజినెస్ వీసాలు జారీ చేసేలా సంస్కరణలు చేయాలని అప్పట్లో క్యాబినేట్‌కి చెప్పారు. అప్పుడు మాత్రమే అమెరికన్ల ఉపాధి అవకాశాలు భద్రంగా ఉంటాయన్నారు. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో గ్రీన్ కార్డులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.