»Have Four Or More Babies In Hungary And Youll Pay No Income Tax For Life Prime Minister Says
Hungary : అక్కడ కనీసం నలుగురు పిల్లలుంటే లైఫ్ టైం ట్యాక్స్ ఫ్రీ!
ఆ దేశంలో జనాలు తక్కువైపోతున్నారని అక్కడి ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నలుగురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలు అక్కడ లైఫ్ టైం ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదట. ఇంతకీ ఈ నిబంధన ఉన్నది ఎక్కడంటే..?
no income tax for life : ఓవైపు భారత్ల్లాంటి దేశాల్లో జనాభా పెరిగిపోతూ ఉంటే కొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఫలితంగా జనాలు లేకపోవడంతో వలసదారులను వారి దేశాల్లోకి ఆహ్వానించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి యూరప్‌లోని హంగేరీ దేశం ఆ దేశ ప్రజలకు బంపరాఫర్ ఇచ్చింది. నలుగురు అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉన్న కుటుంబాలన్నీ జీవితాంతం ఆదాయపు పన్ను చెల్లించక్కర్లేదని తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా దేశ ప్రధాన మంత్రే ప్రకటించడం గమనార్హం. ఇది అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రస్తుతం హంగేరీ(Hungary) దేశ జనాభా 96.4లక్షలుగా ఉంది.
ఈ విషయంపై హంగేరీ(Hungary) ప్రధాని(prime minister) విక్టోర్ ఓర్బన్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. ‘యూరప్‌లో జనం తగ్గిపోతున్నారు. దీంతో ఇతర దేశాల నుంచి వలసలు తెచ్చుకోవాల్సి వస్తోంది. అందుకే మేం భిన్నంగా ఆలోచించాం. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మందిని కనే మహిళలకు జీవిత కాలం ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నాం.’ అంటూ ప్రకటించారు. పెద్ద కుటుంబాల వారు వారి కుటుంబ అవసరాలకు తగినట్లుగా పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవడానికి కూడా సబ్సిడీలు ఇస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగాలు చేసుకునే వారికి ఇబ్బంది కలగకుండా దేశ వ్యాప్తంగా 21 వేల క్రెచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలా అక్కడి ప్రభుత్వం పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థల్ని ప్రోత్సహిస్తోంది.