భాగ్యనగరం(hyderabad)లో ఫేక్ సర్టిఫికెట్లు(Fake certificates) తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఆ క్రమంలో ఆరుగురిని అరెస్టు చేయగా..వారి నుంచి అనేక యూనివర్సిటీలకు చెందిన ద్రువపత్రాలు లభ్యమయ్యాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.
Fake certificate racket in Hyderabad Six people arrested
హైదరాబాద్‌లో(hyderabad) గుట్టుచప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), సరూర్‌నగర్ పోలీసులు శనివారం ఛేదించారు. ఆ క్రమంలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి నుంచి దేశంలోని వివిధ ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన 64 నకిలీ సర్టిఫికెట్లు, ఇతర సంబంధిత మెటీరియల్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో అత్తాపూర్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్ అఫ్రోజ్, చిక్కడపల్లికి చెందిన సర్టిఫికెట్ల సరఫరాదారుడు కె.మణికంఠ, రాయదుర్గంకు చెందిన వై.రత్న కిషోర్ ఉన్నారు. దీంతోపాటు మహబూబ్‌నగర్‌కు చెందిన షాబాజ్ అలీఖాన్, కీసరకు చెందిన పి.సుశీల్‌కుమార్, బాలానగర్ నుంచి ఎ.బాలకృష్ణ అరెస్టయ్యారు. మరోవైపు ప్రధాన నిందితుడు ఢిల్లీకి చెందిన అశు అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిధ యూనివర్సిటీలకు చెందిన ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్‌ల నకిలీ సర్టిఫికెట్ల సరఫరాదారు అయిన ఆశుతో అఫ్రోజ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలోనే అఫ్రోజ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా అతని సాయంతో ఈ దందా మొదలుపెట్టాడు. సులువుగా డబ్బులు వస్తుండటంతో అఫ్రోజ్ ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాడు. నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలను పొందేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, అభ్యర్థులకు ఆశజూపి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. అలా అశు నుంచి నకిలీ ధృవీకరణ పత్రాలను(Fake certificates) సేకరించి రూ.1 లక్ష నుంచి రూ.3.5 లక్షల వరకు వసూలు చేసి వాటిని పలువురికి సరఫరా చేయడం ప్రారంభించారు.
అఫ్రోజ్ డ్రాపౌట్స్ ఫెయిల్ అయిన విద్యార్థుల సమాచారాన్ని సేకరించి, విదేశాలకు వెళ్లడానికి వీసా పొందడానికి నకిలీ సర్టిఫికేట్లు, ఇతర పత్రాలను అందజేస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు సుమారు 50 మంది విద్యార్థులకు నకిలీ విద్యా సర్టిఫికెట్లు అందించి భారీ మొత్తంలో వసూలు చేశాడని పోలీసుల(police) విచారణలో వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.