TG: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ క్రమంలోనే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అభ్యర్థుల వివరాలను బోర్డు విడుదల చేసింది. ఈనెల 28 వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు విధించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత మెరిట్ లిస్ట్‌ను విడుదల చేయనుంది.
ప్రముఖ ప్రభుత్వ సంస్థ HPCLలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (ఇంజినీరింగ్ స్ట్రీమ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 250 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.hindustanpetroleum.comను సంప్రదించండి.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితా విడుదలైంది. ఈ మేరకు యూపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో జాబితాను ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో జాబితాను చూసుకోవాలని తెలిపింది.
రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్స్(ALPs) కోసం కొత్త నియామకాన్ని రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదించింది. 11,127 ALPs ఖాళీలను భర్తీ చేస్తారు. ద.మ. రైల్వేలో 674 పోస్టులు ఉన్నాయి. RRB త్వరలో ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొంది ఉండాలి.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.1,61,890కు చేరింది. అలాగే, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.1,48,400గా నమోదైంది. మరోవైపు వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,95,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 510.82 పాయింట్లు లాభపడి 82736.74 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 151.05 పాయింట్ల లాభంతో 25575.70 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.88గా ఉంది.
ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువతకు భారత వాయుసేన గుడ్‌న్యూస్ చెప్పింది. అగ్నివీర్ వాయు నియామకాలకు గుంటూరులోని నాగార్జున వర్సిటీలో మార్చి 9 నుంచి ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. MAR 9, 10న మహిళా అభ్యర్థులకు, 12, 13న AP పురుష అభ్యర్థులకు, 15, 16న TG పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా అభ్యర్థులు నేరుగా పాల్గొనవచ్చు.
కోనసీమ: రామచంద్రపురంలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉండి, 18-35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సుభాష్ సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ATP: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏ విభాగాలకు చెందిన ఒకటి, రెండు సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ ఆదేశాల నుంచి పరీక్షల విభాగం అధికారులు నాగప్రసాదానాయుడు, శివకుమార్ ఫలితాలు విడుదల చేశారు.
ATP: దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్‌లో ఖాళీగా ఉన్న 16 పాయింట్స్‌మెన్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎండీ రజాక్ తెలిపారు. అర్హులైన మాజీ సైనికులు వచ్చే నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల వేతనంతో పాటు ఇతర భత్యాలు చెల్లిస్తామని పేర్కొన్నారు.
TG: ఇంటర్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ముందుగా ప్రశాంతంగా ఉండాలి. హాల్ టికెట్, పెన్నులు సిద్ధం చేసుకుని 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి, తెలిసిన సమాధానాలను ముందుగా రాయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన పాయింట్లను అండర్ లైన్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు తప్పకుండా రాయండి. ALL THE BEST.
భారత్‌లో రోజువారీ యాక్టివ్ యూజర్లు అత్యధికంగా ఉన్న టాప్ 20 యాప్స్‌లో రెండు భారతీయ యాప్స్ చోటు దక్కించుకున్నాయి. ఆ రెండు యాప్స్‌లో డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘ఫోన్ పే’, స్ట్రీమింగ్ యాప్ ‘జియో హాట్‌స్టార్’ ఉన్నాయి. వాట్సాప్ 83.5 కోట్ల వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గూగుల్, యూట్యూబ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
VZM: గరివిడి మండలం శ్రీరామ్ నగర్‌లోని ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో ఉన్న సుమారు 95 మంది బధిర విద్యార్థులకు చీపురుపల్లి DSP రాఘవులు ఆధ్వర్యంలో కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మంగళవారం కల్పించారు. దర్శనం అనంతరం ప్రసాదాలు అందించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వారికి సూచించారు. విద్యార్థులను సురక్షితంగా తిరిగి సెంటర్‌కు చేర్చారు.
TG: టీజీపీఈ-సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మే 5 వరకు దరఖాస్తు చేసుకొవచ్చని వెల్లడించారు. మే 31 నుంచి జూన్ 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
TG: ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్, SSC పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యంగా హాజరుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. పరీక్షలో అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.