ATM Scam: ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా? అయితే తస్మాత్ జాగ్రత్త!
కేటుగాళ్లు రోజుకో కొత్తరకం స్కామ్‌తో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఏటీఎం మెషీన్ కార్డు రీడర్‌ను ట్యాంపర్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లను అధికారులు సూచిస్తున్నారు.
ATM Scam: కేటుగాళ్లు రోజుకో కొత్తరకం స్కామ్‌తో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఏటీఎం మెషీన్ కార్డు రీడర్‌ను ట్యాంపర్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువ కావడంతో బ్యాంకులు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి. కొందరు దుండగులు మొదట సెక్యూరిటీ గార్డుల్లేని ఏటీఎంలను చూసుకుంటారు. తర్వాత లోపలికి వెళ్లి సీసీటీవీలపై రంగు స్ప్రే చేసి నెమ్మదిగా మెషీన్‌లోని కార్డు రీడర్‌ను తొలగిస్తారు. కస్టమర్ వచ్చి కార్డు పెట్టగానే అది దాంట్లో ఇరుక్కుపోతుంది. దీంతో మోసగాళ్లు సాయం చేస్తామని నమ్మించి పిన్ ఎంటర్ చేయమంటారు. ఎన్నిసార్లు ఇలా పిన్ ఎంటర్ చేసిన కార్డు రాకపోవటంతో బ్యాంకును సంప్రదించమని సలహా ఇచ్చి వెళ్లిపోతారు.
కస్టమర్ వెళ్లిపోగానే మళ్లీ అక్కడికి వచ్చి కార్డు తీసుకుని.. మరో ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకుంటారు. ఇలాంటి స్కామ్‌లు ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. జన సంచారం లేని ప్రాంతాల్లో ఏటీఎంకు వెళ్లవద్దని సూచించారు. ఏటీఎం మెషీన్ సరిగ్గా వర్క్ చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే సెక్యూరిటీ ఉన్న ఏటీఎం ఎంచుకోవడం మేలు. పిన్ ఎంటర్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్లు చూడకుండా జాగ్రత్త పడాలి. ఇతరుల సాయం లేకుండా సొంతంగా లావాదేవీ పూర్తి చేసుకోవాలి. స్టేట్మెంట్లు ఎప్పటికప్పుడు చూసుకోవాలని సూచనలు చేశారు.