సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకోవటం, అన్నా క్యాంటీన్ పై దాడి చేయటంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణ నెలకొంది. ఓ వైపు టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. టీడీపీ ఫ్లెక్సీలను చించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు…. కుప్పం చరిత్రలో ఇదొక బ్లాక్ డే అని అన్నారు. కుప్పంలో ఎప్పుడైనా రాడీయిజం చూశారా అన్న ఆయన… ఇవాళ తనపైనే దాడికి యత్నించారని ఆరోపించారు. మిస్టర్ ఎస్పీ ఎక్కడ ఉన్నావ్ అంటూ ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఇంటిపై దాడి చేయడానికి నిమిషం పట్టదని చంద్రబాబు హెచ్చరించారు. మిస్టర్ జగన్ రెడ్డి… దమ్ముంటే కుప్పానికి రావాలని సవాల్ విసిరారు. ‘నీ దగ్గర 60 వేల మంది పోలీసులు ఉంటే నా దగ్గర 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. జిల్లా ఎస్పీనే ఫ్లెక్సీలను ధ్వంసం చేయించాడు. ధర్మపోరాటం ఇక్కడ్నుంచే ప్రారంభిస్తున్నాను. నేను బ్రతికున్నంత వరకు కుప్పంలో మీరేం చేయలేరు’ అని స్పష్టం చేశారు.