కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడుతోందని…. వారికి ఆస్కార్ అవార్డులు ఇవ్వాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. కుటుంబంలో అందరూ… ఒక్కొక్కరూ ఒక్కో విధంగా నటిస్తున్నారని ఆమె విమర్శించారు.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లిబర్టీ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన షర్మిల..అనంతరం మీడియాతో మాట్లాడారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. పదిశాతం కూడా దళిత బందు ఇవ్వలేదని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఏర్పడిందన్నారు.. అలాంటిది దళితులను కేసీఆర్ కనీసం పక్కన కూడా పెట్టుకోడని..దళితులను తక్కువగా చూడడం కేసీఆర్ నైజం అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యమంలో హరీష్ రావు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మర్చిపోయినట్టు నాటకాలు ఆడాడన్నారు. కానీ, శ్రీకాంతా చారి అగ్గిపెట్టె తెచ్చుకొని అమరుడైతే హరీష్ అగ్గిపెట్టె మర్చిపోతే మంత్రి అయ్యాడని షర్మిల వ్యాఖ్యానించారు.
కేసీఆర్ మాటల్లో ఉన్న చిత్తశుద్ది చేతల్లో కనపడడం లేదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి అంబేడ్కర్ పేరు పెడితే కేసీఆర్ దాన్ని తీసేసారని మండిపడ్డారు. రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ అంబేడ్కర్ని అవమానపర్చారు. రాజ్యాంగం అనేది మన దేశాన్ని నడిపిస్తున్న ఇంధనం అని షర్మిల వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం నిలబడే వాళ్ళని నల్లిని నలిపినట్టు నలిపేయాలని, పెట్రోల్ బాంబులతో దాడి చేయాలని కేసీఆర్ రాజ్యాంగంలో ఉందన్నారు. ఈ నియంత పోవాలని ప్రజలు నిర్ణయించుకోవాలి. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం రావాలని షర్మిల అన్నారు.