Will Contest From Paleru constituency: YS Sharmila
YS Sharmila:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) ప్రకటించారు. దీనిపై ఎవరూ అపోహ పెట్టుకోవద్దని సూచించారు. మే డే సందర్భంగా ఈ రోజు పాలేరు పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి.. మాట్లాడారు. కార్మికుడు లేకుంటే మెతుకు లేదు. ఇంటికి వెలుగు లేదని షర్మిల (YS Sharmila) అన్నారు. దేశాభివృద్ధిలో కార్మికులు కీ రోల్ పోషిస్తారని పేర్కొన్నారు. వారికి తమ పార్టీ సలాం చెస్తోందని చెప్పారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. కేసీఆర్ (KCR) కార్మికులను పురుగుల్లా చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేశారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తే కనీసం గౌరవం కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆ సంస్థలో సంఘమే లేకుండా చేశారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో కార్మికులు సమ్మె చేస్తే వారిని అణచివేతకు గురిచేశారని తెలిపారు. భయ బ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
కార్మికులు కేసీఆర్‌కి (KCR) బానిసలా బ్రతకాలా..? అని అడిగారు. కనీస వేతనాలు కూడా తెలంగాణలో అమలు కావడం లేదని తెలిపారు. కార్మిక చట్టాల ప్రకారం 26 వేలు కనీస జీతం ఉండాలని పేర్కొన్నారు. కానీ ఇక్కడ రూ.10 వేల జీతం కూడా లేదన్నారు. రాష్ట్రంలో కోటి మంది కార్మికులు ఉన్నారని.. వారి సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు లేవని చెప్పారు. కార్మిక సక్షేమం కోసం బోర్డులు కూడా లేవు.. నిధులు కూడా లేవన్నారు. అలాగే 8 గంటల పని విధానం కూడా అమలు కావడం లేదని చెప్పారు.
రాష్ట్రంలో లక్ష మంది కాంట్రాక్ట్ బేసిక్ మీద పని చేస్తున్నారని తెలిపారు. 5 వేల మందిని రెగ్యులర్ చేస్తే ఎలా..? మిగతా కాంట్రాక్ట్ కార్మికులు ఏమవ్వాలని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాలు కూడా సరైనవి కావని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం కింద గొడ్డు చాకిరీ చేయించి 40 రూపాయలు ఇస్తారా..? అని అడిగారు.