నాలుగేళ్ల కిందట వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు పలికిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ పాలనలో ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పరోక్షంగా విమర్శలు చేశారు. తిరుమలలో అధికారుల తీరుపైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రముఖుల సేవలో టీటీడీ తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదు. శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పని చేస్తున్నారు. సొంత ప్రణాళిక ప్రకారం టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారు. సంపన్నులైన భక్తులకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. వీఐపీలో సేవలో అధికారులు తరిస్తున్నారు. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి’ అని రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ కలకలం రేపింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ కు వత్తాసు పలికాడు. అనంతరం సీఎం అయ్యాక జగన్ ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశారు. సనాతన ధర్మం అంతమవుతున్న దశలో విష్ణుమూర్తిలా జగన్ ధర్మాన్ని రక్షిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ పాలనను విమర్శించే తీరులో ట్వీట్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది. ఆయన ఆందోళనకు కారణమేమిటని తెలియడం లేదు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీపై రమణ దీక్షితులు తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.