ప్రత్యేక అజెండాతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సరికొత్త రాజకీయం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన వర్గం సత్తా చాటేలా రాజకీయ ప్రణాళిక రచిస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే బీఆర్ఎస్ కు దూరంగా.. బీజేపీకి దగ్గరగా ఉన్న పొంగులేటి తన వర్గానికి భవిష్యత్ భరోసా ఇచ్చే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే వ్యూహంతో ఉన్న ఆయన తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికార పార్టీని పరోక్షంగా తూర్పారబడుతున్నాడు. తాజాగా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోయి 20 ఏళ్లు అయినా కూడా ప్రజలు తనను ఎన్టీఆర్, వైఎస్సార్ లా గుర్తుంచుకోవాలని, ఆ విధంగా తాను పని చేస్తున్నట్లు మాజీ ఎంపీ పొంగులేటి తెలిపారు.
ఇల్లందులో సోమవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇల్లందులో కోరం కనకయ్యను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కొన్ని ఒత్తిళ్ల వల చాలా మంది నాయకులు ఆత్మీయ సమ్మేళనానికి రాలేదని, ఇక నుంచి వారి దౌర్జన్యాలు, ఆటలు సాగవని కొందరిని ఉద్దేశించి హెచ్చరించారు. నాలుగేళ్లుగా పదవి లేకున్నా తాను ప్రజల్లోనే ఉన్నానని తెలిపారు. తనను జైల్లో పెట్టినా వెనకడుగు వేయనని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న వారికి ఎక్కడ ఇబ్బంది జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతానని, అవసరమైతే నిరాహార దీక్షకు సైతం సిద్ధమని ప్రకటించారు. ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని, తాను చనిపోయిన తర్వాత కూడా 20 ఏళ్లు ప్రజలు గుర్తుంచుకునేలా పని చేస్తానని పేర్కొన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ మాదిరి ప్రజల్లో గూడు కట్టుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.