»Pm Modi Popular Among Chinese Netizens Called Modi The Immortal
PM Modi: అసాధారణ వ్యక్తిగా… చైనాలోను మోడీకి అదిరిపోయే పాపులారిటీ
చైనాలోను ప్రధాని మోడీకి పాపులారిటీ ఉన్నట్లుగా వెల్లడైంది. అసాధారణ సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అంటూ చైనీస్ నెటిజన్లు తెగ పొగుడుతున్నట్లు అమెరికాకు చెందిన మ్యాగజైన్ ది డిప్లొమాట్ వెల్లడించింది.
మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister of India, Narendra Modi) పాపులారిటీ (Modi Popularity) రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే భారత్ లో మాత్రమే కాకుండా, విదేశాల్లోను ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే దాయాది దేశం పాకిస్తాన్ లోని ప్రజలు కూడా మోడీ తమ ప్రధానిగా ఉండి ఉంటే, ధరలు తక్కువగా ఉండేవని, పాలన బాగుండేదని కోరుకున్న వీడియోలను కూడా మనం చూశాం. ఇప్పటి వరకు మనం విన్న దాని ప్రకారం చైనా (China) మినహా అన్ని దేశాల్లోను మోడీకి మంచి పాపులారిటీ ఉంది. అగ్రరాజ్యం అమెరికా నుండి మొదలు పాకిస్తాన్ వరకు చాలామంది ప్రజలు, ఆయా దేశాల్లోని నాయకులు మోడీ (PM Modi) పని తీరు పట్ల ఆభిమానాన్ని పెంచుకుంటున్నారు. తాజాగా, చైనాలోను ఆయనకు పాపులారిటీ ఉన్నట్లుగా వెల్లడైంది. అసాధారణ సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అంటూ చైనీస్ నెటిజన్లు (China netizens) తెగ పొగుడుతున్నట్లు అమెరికాకు చెందిన మ్యాగజైన్ ది డిప్లొమాట్ వెల్లడించింది. మోడీ లావోక్షియన్ (Modi Laoxian) అంటూ చైనా నెటిజన్లు నిక్‌నేమ్ కూడా పెట్టారు. లావోక్షియన్ అంటే ఇమ్మోర్టల్ అని అర్థం. భారత్ ను చైనా లేదా చైనీయులు ఎలా చూస్తున్నారనే అంశంపై ఈ మ్యాగజైన్లో ఓ కథనం వచ్చింది.
చైనాలో సోషల్ మీడియా (Social Media) ట్రెండ్స్‌ను విశ్లేషించే చున్ షాన్ అనే జర్నలిస్ట్ ఈ కథనంలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇతర నేతలతో పోలిస్తే నరేంద్ర మోడీ భిన్నమని చైనా నెటిజన్లు భావిస్తున్నారట. ఆయన వస్త్రధారణ, ఆహార్యం, విధానాలు మునుపటి నేతలతో పోలిస్తే ప్రత్యేకమైనవని పేర్కొంటున్నారు. ఆశ్చర్య పరిచే… అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మొండితనం వంటివి గుర్తించి ఆయనను ఆ పేరుతో పిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు. రష్యా, అమెరికా, దక్షిణాసియా దేశాలతో స్నేహపూ ర్వక సంబంధాలను కొనసాగించడం చైనా నెటిజన్లను ఆకర్షించిందని చెప్పారు.
తాను 20 ఏళ్లుగా అంతర్జాతీయ మీడియా వ్యవహారాలు చూస్తున్నానని, చైనా నెటిజన్లు ఓ విదేశీ నేతపై ఇలా ప్రశంసలు కురిపించడం మొదటిసారి చూస్తున్నానని చున్ షాన్ అన్నారు. ఓ విదేశీ నేతకు ముద్దు పేరు పెట్టడం కూడా తాను చూడలేదని అంటున్నారు. చైనా ప్రజల దృష్టిలో మోడీకి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. చైనాలో ట్విట్టర్ కు పోటీగా వచ్చిన సైనా వీబోలో మోడీ 2015లో చేరారు. ఆయనకు 2.44 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ చైనా యాప్స్ లో నిషేధంలో భాగంగా 2020 జూలై తర్వాత తన అకౌంట్ ను క్లోజ్ చేశారు.