»Passengers Stopped Visakha Express Due To Water Shortage In Vizag
Visakha Expressలో నీటి కొరత.. రైలును నిలిపేసిన ప్రయాణికులు
రైల్వేలోని ఆయా విభాగాల మధ్య సమన్వయం లేక ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తున్నది. కాగా రైల్వే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె చేపట్టడడంతో ఈ పరిణామం ఎదురైందని సమాచారం. ఏది ఏమైనా ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత రైల్వే (Indian Railways) ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అరకొర రైలు సర్వీసులు (Rail Service) అధ్వానంగా మారాయి. నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు. ఈ క్రమంలోనే రైలులో నీటి కొరత (Water Shortage) ఏర్పడింది. పది గంటల పాటు నీటి కొరతతో బాధపడుతున్నా అధికారులు స్పందించకపోవడంతో ప్రయాణికులు రైలును ఆపేశారు. నీళ్లు ఇచ్చేదాకా కదలమంటూ ధర్నాకు దిగారు. ఈ సంఘటన ఏపీలోని విశాఖపట్టణంలో (Visakhapatnam) జరిగింది.
తెలంగాణలోని సికింద్రాబాద్ (Secunderabad) నుంచి భువనేశ్వర్ (Bhuvaneshwar)కు విశాఖ ఎక్స్ ప్రెస్ (Visakha Express) గురువారం రాత్రి బయల్దేరింది. అయితే ఏసీ బోగీల్లో నీటి కొరత ఏర్పడింది. నీళ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడకు చేరుకున్నాక నీటి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. అక్కడ నింపలేదు. మళ్లీ ఫిర్యాదు చేస్తే విశాఖపట్టణంలో నింపుతామని అధికారులు సమాధానం ఇచ్చారు.
విశాఖలోనూ బోగీల్లో నీళ్లు నింపకపోవడంతో ప్రయాణికులు మండిపడ్డారు. ఏసీ బోగి ప్రయాణికులంతా కలిసి రైలును నిలిపివేశారు. నీళ్లు నింపేవరకు రైలును కదలనిచ్చేది లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 20 నిమిషాల తర్వాత రైలు భువనేశ్వర్ కు బయల్దేరింది. రైల్వేలోని ఆయా విభాగాల మధ్య సమన్వయం లేక ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తున్నది. కాగా రైల్వే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె చేపట్టడడంతో ఈ పరిణామం ఎదురైందని సమాచారం. ఏది ఏమైనా ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రైల్వే శాఖ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.