ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఆమెను సీబీఐ అధికారులు.. ఆమె ఎక్కడ కోరితే అక్కడ దర్యాప్తు చేస్తామని కూడా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే…. ఈ కేసు విషయంలో కవిత సడెన్ ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని, ఈ నెల 6న తాను సీబీఐ అధికారులను కలవలేనంటూ లేఖలో పేర్కొన్నారు.
ఈ నెల 11,12,14,15వ తేదీలలో హైదరాబాద్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని, ఆ తేదీలలో ఎప్పుడైనా వచ్చి తనను సీబీఐ అధికారులు కలవొచ్చంటూ కవిత లేఖలో స్పష్టం చేశారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, దర్యాప్తుకు సహకరిస్తానంటూ తెలిపారు.
తనకు ఎఫ్ఐఆర్, కంప్లైంట్ కాపీలు పంపాలంటూ కోరారు. ఎఫ్ఐఆర్, కంప్లైంట్ డాక్యుమెంట్లు పంపితే తాను వివరణ ఇవ్వడానికి ఈజీ అవుతుందని గతంలో రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. తాను అడిగిన డాక్యుమెంట్లు పంపకపోతే వివరణ ఇవ్వడం కష్టమని సీబీఐకు కవిత కండీషన్ పెట్టారు. ఈ క్రమంలో కవిత లేఖపై స్పందించిన సీబీఐ.. ఆమెకు ఎఫ్ఐఆర్, కంప్లైంట్ కాపీలను సోమవారం పంపించింది. వీటిని పరిశీలించిన కవిత.. ఈ నెల 6వ తేదీన వివరణ ఇవ్వలేనంటూ సీబీఐకు మరో లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.