»Indore Death Toll Rises To 35 In Indore Stepwell Tragedy
Indore Stepwell Tragedy మెట్లబావి దుర్ఘటనలో 35కు చేరిన మృతుల సంఖ్య
అతి పురాతనమైన ఆ బావి దాదాపు 50 అడుగుల లోతు ఉంది. ఈ బావిని 40 ఏళ్ల కిందట మూసేశారు. పైన శ్లాబుతో ఫ్లోరింగ్ చేసి ఉంచారు. అధిక బరువు ఉండడంతో ఒక్కసారిగా అది కూలిపోయిందని పోలీసులు తెలిపారు.
శ్రీరామనవమి (Sri Rama Navami) ఉత్సవాలు ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. సీతారాముల కల్యాణం కనులారా వీక్షించేందుకు వచ్చిన ఆ కుటుంబాలు కన్నీటి సుడిలో మునిగాయి. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం ఇండోర్ (Indore)లో మెట్ల బావి (Stepwell) ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలిన సంఘటనలో (Indore Stepwell Tragedy) మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా ఒకరు గల్లంతయ్యారని తెలిపారు.
ఇండోర్ లోని పటేల్ నగర్ శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో (Beleshwar Mahadev Temple) శ్రీరామనవమి వేడుకలు గురువారం వైభవోపేతంగా నిర్వహించారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అయితే ఉత్సవాలు జరుగుతుండగా ఆలయంలోని పురాతన మెట్ల బావి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. నాసిరకం స్లాబ్ (Slab)తో నిర్మాణం చేయడంతో పైకప్పు భక్తుల బరువును మోయలేక కులిపోయింది. దీంతో దానిపై కూర్చున్న భక్తులంతా బావిలోకి పడిపోయారు. బావిలో నుంచి 35 మృతదేహాలను వెలికితీశామని ఇండోర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇళయరాజా ప్రకటించారు. కాగా ఓ వ్యక్తి గల్లంతయ్యాడని తెలిపారు.
బావిలో 50 మందికి పైగా పడిపోయారు. వెంటనే అగ్నిమాపక, స్థానిక పోలీస్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. బావిలోని ఒక్కొక్కరిగా పైకి తీసుకొచ్చారు. కింద ఉన్న వారు మృత్యువాత పడ్డారు. మృతుల్లో అధికంగా మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా అతి పురాతనమైన ఆ బావి దాదాపు 50 అడుగుల లోతు ఉంది. ఈ బావిని 40 ఏళ్ల కిందట మూసేశారు. పైన శ్లాబుతో ఫ్లోరింగ్ చేసి ఉంచారు. అధిక బరువు ఉండడంతో ఒక్కసారిగా అది కూలిపోయిందని పోలీసులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సహాయం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించింది. శుక్రవారం ఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) పరిశీలించారు. కాగా ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu), ప్రధాని మోదీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా బాధకరమైన దుర్ఘటన. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ తో మాట్లాడాను. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించాను’ అని ప్రధాని ట్వీట్ చేశాడు.