తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది.ఏపీ (AP) లోని కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర్లోని ఐతవరం (Aitavaram) వద్ద మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు జాతీయ రహదారిపైకి చేరింది. విజయవాడ – హైదరాబాద్ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ (Traffic jam) ఏర్పడింది. దీంతో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ (Hyderabad) – విజయవాడ మధ్య నడిచే రెగ్యులర్ బస్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈమేరకు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ (Sajjanar) ఓ ట్వీట్ చేశారు.హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యూలర్ టీఎస్ఆర్టీసీ బస్సుల రద్దు చేస్తున్నాం. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడ(Vijayawada)కు టీఎస్ఆర్టీసీ బస్సులు వెళ్తాయి.ఎంజీబీఎస్ నుంచి ప్రతీ అరగంటకో బస్సు ఉంటుంది. దీనిపై మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ (TSRTC) కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలన్నారు.