Heavy rains: Heavy to very heavy rains in Telangana
Heavy rains: తెలంగాణలో ఈరోజు భారీ, రేపటి నుంచి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ జిల్లాల్లో 11.5 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గాలులు కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉంది. ఈ గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడటం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడటం వంటివి కూడా జరగవచ్చు. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీగా ఉంటాయి.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా కురుస్తాయి. రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కుంచవెల్లిలో 13.2 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాలలో 7.8, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 7.6, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 5.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వికారాబాద్, మెదక్, ములుగు, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.