టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంటిబాట పట్టింది. అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ భారత బౌలర్లను కుమ్మేశారు. ఏ ఒక్కరినీ వదలకుండా వీర బాదుడు బాదారు. మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయ్యారు. జోస్ బట్లర్ 80 పరుగులు చేయగా, అలెక్స్ హేల్స్ 86 పరుగులు చేశాడు.
తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు మొదటి నుంచి హిట్టింగ్ ప్రారంభించింది. 4 ఓవర్లలో 41 పరుగులు చేసింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. మొదటి నుంచి చివరి వరకు అదే ఊపు కొనసాగించారు. బౌండరీల వర్షం కురిపించారు. మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యం చేరుకున్నారు. తద్వారా ఫైనల్స్ లో ప్రవేశించారు. పాక్ జట్టుతో ఆదివారం జరిగే తుదిపోరులో తలపడనున్నారు.