మూడేండ్ల తర్వాత గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ప్రసంగం చేశారు. దేశానికి తెలంగాణ పాలన ఆదర్శంగా నిలుస్తోందని ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. అనేక మలుపులు తిరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా మొదలుకావడం విశేషం. అయితే గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ప్రభుత్వం అనేక తప్పులను గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించిందని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియా పాయింట్ లో మాట్లాడారు.
‘ప్రభుత్వం అనేక తప్పులను గవర్నర్ ప్రసంగం ద్వారా చేయించారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అనేది శుద్ధ తప్పు. ఆరు గంటలు కూడా విద్యుత్ రావడం లేదని రైతులు సబ్ స్టేషన్ లలో ఆందోళన చేస్తున్నారు. రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వడం లేదు అంటూ… సాక్షాత్తు ప్రభాకర్ రావు తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో అనేక అబద్ధాలు ఉన్నాయి. ప్రసంగంలో ధరణి ప్రస్తావన లేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ మాత్రమే గవర్నర్ చదివింది. ధరణితో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర నిధులతో మాత్రమే అర్బన్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించారు. గజ్వేల్, సిద్ధిపేట మినహా ఇంకెక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదు. ధరణి, డబుల్ బెడ్ ఇళ్లు రాక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గొప్పలు చెప్పుకోడానికి మాత్రమే పనికి వచ్చే ప్రసంగం ఇది’ అని ఈటల రాజేందర్ విమర్శలు చేశారు.