డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పైన, ఆ పార్టీ నేతల పైన భారీ అవినీతి ఆరోపణలు చేసిన బిజెపి తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కి నోటీసులు పంపించారు. తమ పైన అక్రమ ఆరోపణలు చేశారని డీఎంకే నేతలు మండిపడ్డారు. డీఎంకే ఫైల్స్ పేరుతో అన్నామలై మూడు రోజుల క్రితం ఆ పార్టీ నేతల అక్రమ ఆస్తులు బయట పెట్టిన విషయం తెలిసిందే. దీంతో డీఎంకే ఆయనకు రూ.500 కోట్ల పరువు నష్టం నోటీసులు పంపించింది. అంతేకాదు తమ పైన ఆరోపణలు చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
అంబేడ్కర్ జయంతి రోజున స్టాలిన్ తో పాటు పలువురు నేతల పైన చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ అర్ ఎస్ భారతి పేర్కొన్నారు. ఇవి పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని చెప్పారు. అర్ ఎస్ భారతి సూచనల మేరకు రాజ్య సభ ఎంపీ విల్సన్ పది పేజీల నోటీసులు జారీ చేశారు. ఐదున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో తమ పార్టీ అధినేత ఈ ఒక్కరి వద్ద నుండి అక్రమంగా ఒక్క పైసా తీసుకోలేదు అని చెప్పారు.