»Chandrababu Is The First Former Cm To Be Jailed In Ap Section 409 Compliance
AP: ఏపీలో జైలుకెళ్తున్న తొలి మాజీ సీఎంగా చంద్రబాబు..409 సెక్షన్ వర్తింపు
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జైలుకు వెళ్లిన తొలి మాజీ సీఎంగా చంద్రబాబు నిలిచారు.
తెలుగు రాష్ట్రాల్లో జైలుకెళ్తున్న తొలి మాజీ సీఎంగా చంద్రబాబు నిలిచారు. సిట్ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు బాబుకు రిమాండ్ విధించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సెప్టెంబర్ 22వ తేది వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆదివారం రాత్రి చంద్రబాబును సిట్ ఆఫీసుకు తీసుకెళ్లి సోమవారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
స్కిల్ స్కామ్ కేసులో భాగంగా చంద్రబాబును సీఐడీ అధికారులు శనివారం నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విజయవాడ సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. 40 గంటల తర్వాత కోర్టు ఈ కేసులో బాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో చంద్రబాబుపై 34 అభియోగాలను సీఐడీ నమోదు చేసింది.
సీబీఐ కోర్టులో ఆదివారం ఉదయం చంద్రబాబును ప్రవేశపెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబే ప్రధాన సూత్రదారి అని సీఐడీ ఏసీబీ కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించింది. మొత్తం 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్టును సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బు విడుదలైందని సీఐడీ మెమో కూడా దాఖలు చేసింది.
పవన్ కళ్యాణ్ ఆగ్రహం
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్నారు. కోనసీమలో 2 వేల మంది కిరాయి మూకలను తమపై వదిలారన్నారు. చంద్రబాబుకు తనమ మద్దతు ఇప్పుడైనా, ఎప్పుడైనా ఉంటుందన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తోందన్నారు. జగన్ రాష్ట్రంలోని తన ప్రత్యర్థులందరినీ నేరగాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సడన్గా జగన్ ఆస్తులు ఎలా పెరిగాయో ఎవరికీ తెలియడం లేదన్నారు.
ప్రజా సొమ్మును దోచుకున్నారు: రోజా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి భగవంతుడు సరైన సమయంతో శిక్ష వేశారని ఏపీ మంత్రి రోజా అన్నారు. ఎంతో మంది ఉసురు పోసుకున్న చంద్రబాబుకు జైలు శిక్ష పడటం మంచి పరిణామమన్నారు. ఎంతో మందిని క్యారెక్టర్ లేని వారిగా చంద్రబాబు చిత్రీకరించారని, ప్రజా సొమ్మును దోచుకున్నారని, కోట్లాది రూపాయలను దోచుకుని అనేక కుంభకోణాలను పాల్పడ్డారన్నారు.
409 సెక్షన్ వర్తింపు:
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 ప్రకారంగా.. ఎవరైనా, ఏదైనా పద్ధతిలో ఆస్తిని అప్పగిస్తే లేదా పబ్లిక్ సర్వెంట్ హోదాలో ఆస్తికి సంబంధించి నేరపూరిత ఉల్లంఘనలకు పాల్పడితే వారికి జీవిత ఖైదు లేదా పదేళ్ల శిక్ష పడుతుంది. జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబుకు కూడా ఈ కేసులో ఈ సెక్షన్ వర్తిస్తుందని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. సీఐడీ అధికారుల వాదనలతో కోర్టు ఏకిభవిస్తూ బాబుకు రిమాండ్ విధించింది.