విద్యార్థుల ప్రవర్తనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోపోద్రిక్తులయ్యారు. ఎధవలు.. వారిని తోసి పడేయండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్యాంట్లు, హెయిర్ కట్ ఏమిటీ అని మండిపడ్డారు. ఏం సాధించారని విర్రవీగుతున్నారని కోపాన్ని అణుచుకోలేక విద్యార్థులను తిట్టిపోశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగింది? ఆయనకు కోపమొచ్చేలా విద్యార్థులు ఏం చేశారో తెలుసుకోండి.
నల్లగొండ పట్టణంలో ‘జనగణమన ఉత్సవ సమితి’ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య గీతాలాపన వార్షికోత్సవంలో సోమవారం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళా ప్రదర్శనలు ఆసక్తిగా సాగాయి. అనంతరం ఓ విద్యార్థిని సభా వేదికపైకి వచ్చి ప్రసంగిస్తుండగా.. కూర్చున్న విద్యార్థులు కామెంట్స్ చేశారు. అమ్మాయిని ఆట పట్టించేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంటనే మైక్ అందుకున్న లక్ష్మీనారాయణ విద్యార్థుల తీరుపై మండిపడ్డారు. అసలు విద్యార్థుల్లాగా ఉన్నారా? ఇట్లాంటి వారి వల్లనే దేశం ఇలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా కామెంట్స్ చేసిన విద్యార్థులను బయటకు పంపాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థిని మాట్లాడాలని లక్ష్మీనారాయణ చెప్పారు.