ఏపీలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీనగర్‌లోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్‌ను పూర్తి చేయాలంటూ నిరసనకు పిలుపునిచ్చిన క్రమంలో పోలీసులు ఎమ్మెల్యేను గృహనిర్బంధం చేశారు. దీంతో ఎమ్మెల్యే నివాసం చుట్టూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
ఎవరిని కూడా బయటకు రానివ్వడంలేదు. రూరల్ పరిధిలోని గాంధీనగర్‌లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ..నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దీంతో నిరసనకు అనుమతులు లేకపోవడంతో తాము ఆ నిరసన కార్యక్రమాన్ని అనుమతించబోమని పోలీసులు తేల్చి చెప్పారు. కాగా ఎలాగైనా నిరసనను కొనసాగిస్తానని కోటంరెడ్డి స్పష్టం చేయడంతో.. ముందు జాగ్రత్తగా చర్యగా ఆయనను హౌస్ అరెస్ట్(house arrest) చేశారు పోలీసులు.
క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం నిధులు ఇవ్వాలని మూడేళ్లుగా కోరుతున్నామన్నారు కోటంరెడ్డి. ఐతే దీని కోసం ముఖ్యమంత్రి(cm jagan) స్వయంగా మూడుసార్లు సంతకాలు చేశారని తెలిపారు. తాము విధ్వంసం చేయడం లేదని.. కేవలం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యల కోసం పోరాడుతూనే ఉంటామన్నాయన.. పోలీసుల తీరు సరికాదన్నారు. క్రిస్టియన్ కమిటీ హాల్ నిర్మాణం కోసం కేవలం 7 కోట్ల రూపాయల నిధులు మాత్రమే అడిగామని ఈ సందర్భంగా తెలిపారు కోటంరెడ్డి.