Leopard: తిరుమలలో చిక్కిన మరో చిరుత..ఇంకా ఎన్ని ఉన్నాయ్?
తిరుమలలో కాలినడన వెళ్లే అలిపిరి మార్గంలో చిరుతపులుల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని బంధించేందుకు అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటివల ఒక చిరుతపులి బంధీ కాగా, తాజాగా మరోకటి బోనులో చిక్కింది.
Leopard: తిరుమల తిరుపతి(Tiripati)కి వెళ్లే భక్తుల సంరక్షణ చర్యలు ఫలిస్తున్నాయి. తాజాగా మరో చిరుత(Leopard) బోను(Cage)లో చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఒక చిరుతపులి చిక్కినట్లు అటవీశాఖ(Forest), టీటీడీ(TTD Officials) అధికారులు తెలిపారు. వెంకటేశ్వరస్వామి దర్శణానికి వెళ్లే భక్తులకు చిరుతపులుల బెడద ఎక్కువైపోయింది. చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు అయితే మరీ భయాందోళనలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో వెళ్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలిక లక్షిత చిరుత దాడి చేయడంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులకు భరోసా ఇస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. వాటిని బంధించేందుకు కాలినడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు పెట్టారు. అంతేకాకుండా భక్తులకు చేతికర్రలు అందిస్తామని ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.
మూడు రోజుల క్రితం బోనులో ఓ చిరుత చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం తెల్లవారుజామున మరో చిరుత చిక్కినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 50 రోజుల సమయంలోనే ఇలా మూడు చిరుతలు చిక్కడంతో అడవిలో ఇంకెన్ని ఉన్నాయోనని భక్తులు భయాందోళన చెందుతున్నారు. అలాగే కాలి నడకన వెళ్లే భక్తులు ఎప్పటికప్పడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు సూచిస్తున్నారు. స్వామి దర్శణానికి వెళ్లే భక్తులు మాత్రం ఒకింత అసహనానికి గురవుతున్నారు. ధైవదర్శనం కోసం తిరుపతికి వస్తుంటే ఇలా బిక్కుబిక్కుమంటు రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. కాలినడకన వెళ్లే వారిది చిరుతల బాధ అయితే సొంత వాహనాల్లో వెళ్లేవారిది ఘాట్ రోడ్ల మలుపులతో ప్రమాదాలు జరుగుతాయని, కొండచర్యలు విరిగిపడుతాయని మరో బాధ. మరి వీటిన్నంటిని పరిష్కరిస్తేగాని తిరిపతికి వెళ్లే భక్తులకు ప్రశాంతత ఉండదు.