దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వర్షాలకు జనజీవనం స్థంభించడమే కాకుండా వాగులు, వంకలు, నదులు భీకరంగా ప్రవహిస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణశాఖ(Weather Department) హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో కుండపోత వర్షాలు పడతాయని వెల్లడించింది.
ఏపీ(Andhra Pradesh)లోని 10 జిల్లాలకు భారీ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరితో పాటు ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ(Weather Department) రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange alert) జారీ చేస్తూ ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రకటన చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురగాలులు వీస్తాయని, ఈ ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది.