»Weather Department Warning For Ap Heavy Rain Forecast For Many Districts
Rain Alert: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక..పలు జిల్లాలకు భారీ వర్షసూచన!
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మరో 5 రోజుల పాటు వర్షసూచన ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఏపీ (Andhrapradesh)కి వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Weather Department) తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడన ప్రభావం వల్ల పలు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.
రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, బాపట్ల, పార్వతీపురం మన్యం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (Weather Department) అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గత రెండు రోజుల నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలోని ఏలూరు జిల్లా పోలవరంలో 46.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 45.8, బాపట్ల జిల్లా కారంచేడులో 42.2, విజయనగరం జిల్లా బొందపల్లిలో 38.2, గుంటూరు జిల్లా తెనాలిలో 35.8, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 34.4, తునిలో 34, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలసలో 32.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాయలసీమ (Rayalaseema)లోని చిత్తూరులో 99 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 85.2, నగరిలో 34.2, వెంకటగిరిలో 32.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. మంగళవారం కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (Weather Department) వెల్లడించింది.