»The Reason For The Fire Accident In Visakhapatnam Fishing Harbor Two Arrested
Vizag Harbour: విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదానికి కారణం అదే..ఇద్దరు అరెస్ట్
విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో సిగరెట్ తాగి బోట్ ఇంజిన్‌పై విసిరివేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం మరికొందరిని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ (Vizag Fishing Harbour)లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బోట్లు కూడా దగ్ధమయ్యాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో యూట్యూబర్ నానిని అనుమానించి దర్యాప్తు సాగించారు. అలాగే గంజాయ్ బ్యాచ్‌ను కూడా అనుమానించి విచారణ చేశారు. బోటు అమ్మే విషయంలోనే గొడవ జరిగినట్లు భావించారు. ఆఖరికి మూడు రోజుల తర్వాత పోలీసులు అసలు నిందితులెవరో గుర్తించారు. ఈ సందర్భంగా విశాఖ నగర సీపీ రవి శంకర్ అయ్యన్నార్ శనివారం మీడియా ముందు పలు కీలక విషయాలను వెల్లడించారు.
అగ్నిప్రమాదానికి కారకులైన వాసుపల్లి నాని అలియాస్ దొంగ కోళ్లు, అతని మామ అల్లిపల్లి వెంకటేష్ లను అరెస్ట్ చేశారు. యూట్యూబర్ పేరు కూడా వాసుపల్లి నానినే కావడంతో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ఇంకో వాసుపల్లి నాని అని మరో వ్యక్తిని కూడా తీసుకొచ్చి విచారించినట్లు తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో వల్ల తీవ్ర నష్టం జరిగిందన్నారు. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామన్నారు.
సీసీ ఫుటేజ్‌ని పరిశీలించిన పోలీసులు ముందుగా యూట్యూబర్ నానిని అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే 30 మందిని అనుమానితులుగా గుర్తించి వారిని కూడా విచారించామన్నారు. ఈ ఘటనలో 30 బోట్లు పూర్తిగా కాలిపోయాయని, అలాగే మరో 19 బోట్లు పాక్షికంగా కాలిపోయినట్లు సీపీ వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిళ్లిందని సీపీ రవి శంకర్ అయ్యన్నార్ తెలిపారు.
సంఘటన స్థలంలో వాసుపల్లి నాని అలియాస్ దొంగ కోళ్లు, అతని మామ అయిన అల్లిపిల్లి వెంకటేష్‌లు మద్యం సేవించి సిగరెట్ తాగారని, ఆ సమయంలో మద్యం మత్తులో సిగరెట్ తాగి నిర్లక్ష్యంగా పక్క బోట్‌పై ఆ సిగరెట్‌ను విసిరివేసినట్లు తెలిపారు. ఆ సిగరెట్ కాస్తా పక్క బోట్ లోని ఇంజిన్‌పై పడటంతో గాలి వల్ల ఇంజిన్ మండిందని, ఆ సమయంలో పెను ప్రమాదం సంభవించిందని సీపీ వెల్లడించారు. ఇద్దర్నీ అరెస్ట్ చేసి మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.