పొత్తులపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. వైసీపీతో కలిసి పనిచేసేది లేదని తేల్చిచెప్పారు. జనసేనతో ఛాన్స్ ఉందని సంకేతాలు ఇచ్చారు. జనంతో వస్తేనే కలిసి బరిలోకి దిగుతామని చెప్పారు. కలిసి పోటీ చేసే అంశంపై సోము వీర్రాజు క్లారిటీతో ఉన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం పూటకో మాట మాట్లాడుతున్నారు. కలిసి పోటీ చేస్తాం అని ఒకసారి.. లేదు అని మరొకసారి వ్యాఖ్యానించారు. దీంతో ఆ రెండు పార్టీల పొత్తుపై సందిగ్ధత నెలకొంది.
2019 ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ, జనసేన బాగానే ఉన్నాయి. తర్వాత కలిసి పోటీ చేస్తామని ప్రకటన కూడా చేశాయి. ఇటీవల మాత్రం చాలా మార్పులు వచ్చాయి. పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ కావడంతో సిచుయేషన్ మారిపోయింది. అంతకుముందు బీజేపీతో దోస్తి అన్న పవన్.. తర్వాత టీడీపీ వైపు మొగ్గుచూపారు. అందుకే పూటకో మాట మాట్లాడుతున్నారు. నిజానికి ఇది బీజేపీని గందరగోళానికి గురిచేస్తోంది. పవన్ ప్రకటనతో బీజేపీ నేతలకు ఏం చెప్పడం తెలియడం లేదు.
ఇటీవల జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో జనసేనతో పొత్తు గురించి ప్రస్తావనకు రాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాత్రం పవన్ తమతో కలిసి ఉంటారని అంటున్నారు. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ధీమాగా ఉన్నారు. ఏపీలో కాపు ఓట్లు ఎక్కువ.. పవన్ కల్యాణ్ వెళితే ఆ సామాజిక వర్గం ఓట్లు పడతాయి. గతంలో చంద్రబాబు కూడా పవన్ మేనియాతో అధికారం చేపట్టారు. బీజేపీ కూడా తమకు కలిసి వస్తోందని అనుకుంటోంది.