Nara Lokesh: ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను జగన్ గాలిలోకి వదిలేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పదవీ చేపట్టక ముందు హామీలు ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చకుండా గాలికొదిలేశారని మండిపడ్డారు. ఎలమంచిలి నియోజవర్గంలో 224వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా అరబుపాలెంలోని నాయకులు, బెల్లం తయారీదారులు, రైతులతో లోకేశ్ సమావేశమయ్యారు. బీసీలపై జగన్ ప్రభుత్వం 26 వేల అక్రమ కేసులు పెట్టింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. ప్రభుత్వ పెద్దల అండతోనే రాష్ట్రంలో గంజాయి సాగు కూడా జరగుతుందని ఆరోపించారు.
టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్లంపై ఉన్న ఆంక్షలు తొలగిస్తాం. చెరకు రైతులకు ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం. ప్రస్తుతం వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ కాల్వల నిర్వహణను కూడా పూర్తిగా గాలికొదిలేశారు. కాల్వలోని పూడికలను కూడా తీయట్లేదు. మేం అధికారంలోకి వస్తే కాల్వలో నీరు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని లోకేష్ తెలిపారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను జగన్ గాలికొదిలేశారని ఆరోపించారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని నారా లోకేశ్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.