Fight against steel plant privatization:JD laxminarayana
వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుండి లోక్ సభకు పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 లో తాను పోటీ చేయడం ఖాయమని, అవసరం అయితే స్వాతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తనవంతు కృషి తప్పకుండా చేస్తానని చెప్పారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం వావిలాల గోపాల కృష్ణయ్య చేపట్టిన పైసా ఉద్యమం స్పూర్తితో ప్రతి తెలుగు కుటుంబం నెలకు రూ.100 ఇస్తే రూ. 850 కోట్లు సమకూరుతుందని, ఇలా నాలుగు నెలల పాటు నిధులు సేకరిస్తే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవచ్చు అని తెలిపారు.
కాగా.. విశాఖ నుండి పోటీ చేస్తానని ఇప్పటికే పలు మార్లు చెప్పారు లక్ష్మినారాయణ. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆ పార్టీకి దూరం జరిగారు. సొంత పార్టీ పెడతారని, ఇతర పార్టీలలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి సమయంలో తాను పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు.