ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీకి పవన్ కళ్యాణ్ షాకిచ్చారా?
జనసేనాని షరతులకు కమలం పార్టీ అంగీకరించలేదా?
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న పవన్ ఆ ప్రయత్నాలు చేసి, విఫలమయ్యారా?
ఇక బీజేపీతో కాదనే నిర్ణయానికి వచ్చేశారా?
ఫైనల్‌గా మెజార్టీ ప్రతిపక్ష ఓటు చీలని పార్టీ దిశగా అడుగు వేశారా?
ఆ లెక్కల తర్వాతే బాబును కలిసి, పొత్తుపై క్లారిటీ ఇచ్చారా?
అలా అయితేనే వైసీపీని నిర్ణయానికి వచ్చేశారా?
వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెక్ పెట్టాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగా గత కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన ప్రయత్నాల్లో అంతగా సఫలం కాని పరిస్థితుల్లో రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది.
2019 ఎన్నికల్లో విపక్షాలు ఒంటరిగా పోటీ చేయడం వల్లే వైసీపీకి 150కి పైగా సీట్లు వచ్చాయని భావిస్తున్నారు. 2024లో మాత్రం అలాంటి పొరపాటు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని జనసేనాని మొదటి నుండి చెబుతున్నారు.. ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా టీడీపీతో, బీజేపీతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాల ఓటు చీలనివ్వనని పవన్ పలుమార్లు ఉద్ఘాటించారు. ఏపీలో బీజేపీకి అంతగా బలం లేకపోయినప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఈ కారణంగా ఏపీలో బలమైన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలనేది ఆయన ఉద్దేశ్యంగా కనిపించింది.
అయితే టీడీపీతో వెళ్లే ఆలోచన బీజేపీకి మొదటి నుండి లేదనే అభిప్రాయం ఉంది. కానీ పవన్ కళ్యాణ్‌తో మాత్రం వెళ్లేందుకు వారు ఉత్సాహంగా ఉన్నారు. ఈ కారణంతో జనసేనాని ఆ పార్టీ కీలక నేతలతో దోస్తీ అంశాన్ని కొనసాగిస్తూనే, మూడు పార్టీలను కలిపే దిశలో ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. బీజేపీతోను కలిసి ఉండాలని, పలుమార్లు ఆయన రూట్ మ్యాప్ కూడా అడిగారు. బీజేపీని రూట్ మ్యాప్ అడిగితే ఇవ్వడం లేదని కొద్ది నెలల క్రితం కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వకపోవడానికి ఒకే ఒక్క కారణం కనిపిస్తోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉండేందుకు టీడీపీతో కూడా కలుద్దామని జనసేనాని భావిస్తుంటే, బీజేపీకి మాత్రం చంద్రబాబుతో కలిసే ఆసక్తి లేదని, అందుకే రూట్ మ్యాప్ ఇవ్వలేదనేది మరో వాదన.
పవన్ తనవంతుగా ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలప్రదం కాకపోవడం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నందున మరీ ఆలస్యమైతే బాగుండదని ఓ నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. అన్ని లెక్కలు వేసుకున్న పవన్ గతంలో ప్రతిపక్షాలను సంఘటితం చేస్తామన్నారు. ఆదివారం నాటి భేటీ అనంతరం తాము కలుస్తామని స్పష్టం చేశారు.
ఏపీలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేదు. పైగా తెలంగాణలో బండి సంజయ్ ఆధ్వర్యంలో పుంజుకున్నట్లుగా తమ వద్ద జరుగుతుందా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అది కనిపించడం లేదు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కాబట్టి, బీజేపీ – జనసేన కలిస్తే ప్రతిపక్ష ఓటు చీలిక భారీగా ఉండి, మళ్లీ జగన్‌కే లబ్ధి చేకూరుతుంది. అంతంత ఓటు బ్యాంకు మాత్రమే ఉన్న బీజేపీతో కలవడం కంటే, టీడీపీతో కలిస్తే వైసీపీని దెబ్బ కొట్టవచ్చునని పవన్ భావించి ఉంటారు. పైగా, బీజేపీతో కలిస్తే ఎన్నికల సమయంలో లెఫ్ట్ పార్టీ దరి చేరే అవకాశం లేదు. టీడీపీతో కలిసి ఉంటే అది సాధ్యమవుతుంది. ఇలా అన్ని లెక్కలు వేశాకే, పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేతను కలిసి పొత్తుపై క్లారిటీ ఇచ్చారని అంటున్నారు.