ఏపీ బీజేపీ ఇంఛార్జి సునీల్ దియోధర్ (Sunil Deodhar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నానిని జైలుకు పంపిస్తామని అన్నారు. గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బీజేపీ చార్జిషీట్ కార్యక్రమంలో భాగంగా చేసిన ప్రసంగంలో దియోధర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్ (Sunil Deodhar) మండిపడ్డారు. గుడివాడ (Gudivada) యువతను కొడాలి నాని సర్వనాశనం చేస్తున్నారని సునీల్ దియోధర్ ఆరోపించారు.తెలుగు వారికి ఎంతో ప్రముఖమైన సంక్రాంతి పండుగను కూడా ఆయన క్యాసినో(Casino), క్యాబరే డ్యాన్సులుగా మార్చేశారని ఆయన తెలిపారు.కొడాలి నాని వంటి వ్యక్తి జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే ఇలాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. బూతులు మాట్లాడి ఫేమస్ కావడం తప్ప అతను ఏం చేశాడని నిలదీశారు. ఇలాంటి ఎమ్మెల్యే వల్ల ఏపీ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచి రాజకీయ వేడి కొనసాగుతుంది. అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ వ్యుహా, ప్రతివ్యుహాలతో ఇప్పటి నుంచే రానున్న ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన టీడీపీ (TDP).. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తుంది. మరోవైపు సంక్షేమం అజెండాగా ముందుకు సాగుతున్న వైసీపీ.. మరోసారి అధికారాన్ని నిలుపుకునేలా పావులు కదుపుతుంది.