తాము రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నామని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రకటించారు. బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వేదికపై ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. తనతో పాటు తన తనయుడు హితేష్ కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటాడని చెప్పారు. డబ్బుతో రాజకీయం కక్ష సాధింపులకు దిగడం వంటివి తమ కుటుంబానికి అలవాటు లేని విషయాలు అన్నారు. గతంలో చేసిన రాజకీయాలకు, నేటి రాజకీయాలకు ఏమాత్రం పొంతన లేదన్నారు. అందుకే తాను, హితేష్ రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు చెప్పారు.
మీరు, మీ తనయుడు రాజకీయాల్లో ఉండాలంటూ కొంతమంది చెబుతారని, కానీ ప్రస్తుత రాజకీయాల గురించి ఏం చెప్పలేమన్నారు. ఓ ఎమ్మెల్యేగా, మంత్రిగా అభివృద్ధి చేసే అవకాశం తనకు దేవుడు దక్కించారన్నారు. ఆ సంతృప్తి తనకు ఉన్నదని, కానీ ఇంతటితో రాజకీయాలకు స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. గత ఎన్నికల్లో తన కొడుకు కోసం ప్రయత్నం చేశామని, కానీ ఆ భగవంతుడు మాత్రం వద్దని చెప్పినట్లుగానే భావిస్తూ, ఈ జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించినట్లు చెప్పారు. తనకు ఆసక్తి కలిగిన పనులు ఏవైనా చేసుకుంటానని, కానీ ఇప్పుడున్న రాజకీయాలు మాత్రం వద్దన్నారు. రోజులు మారి, డబ్బు రాజకీయం పోయి, ప్రజలకు సేవ చేసే రాజకీయం వస్తే తనకు, తన కొడుక్కు మళ్లీ అటువైపు వెళ్లినా అభ్యంతరం లేదన్నారు. కానీ ఈ కొనుగోలు రాజకీయంలో తృప్తి లేదన్నారు. అందుకే దూరమవుతున్నామన్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వర రావు సతీమణి పురంధేశ్వరి బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 20019లో ఆమె కమలం పార్టీలో ఉండగానే, దగ్గుబాటి, ఆయన తనయుడు వైసీపీలో చేరటం చర్చనీయాంశంగా మారింది. వెంకటేశ్వర రావు 1983 నుండి 1991 వరకు వరుసగా మూడుసార్లు పర్చూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009లలోను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు తనతో పాటు తన కొడుకు కూడా రాజకీయాలకు దూరమని చెబుతున్నారు.