»Cyclone Threat To Ap Meteorological Department Warning
Ap Rain Alert: ఏపీకి తుఫాను ముప్పు..వాతావరణశాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఎండీ తుఫాను హెచ్చరిక చేసింది. రాబోయే మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురిసినా ఆ తర్వాత ఐదు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వాయుగుండం బలపడే అవకాశం ఉందని ఈ నెల 25 తర్వాత తుఫాను బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఎండకు, ఉక్కపోతకు అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ప్రజలకు వాతావరణ శాఖ (Weather Department) శుభవార్త చెప్పింది. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించిన వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం రేపు సాయంత్రంలోపు అల్పపీడనంగా బలపడనుందని, దీంతో తుఫాను సంభవించే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, 23వ తేది నుంచి అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరో 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు (Monsoon) నిష్క్రమించడం, ఈశాన్య రుతుపవనాలు వచ్చేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతుండటంతో రాష్ట్రంలో వర్షాలు ఒక్కసారిగా ఊపందుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతం (Bay Of Bengal)లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా, ఆ తర్వాత వాయుగుండంగా మారి మరింత బలపడితే అక్టోబర్ 25వ తేదికల్లా ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు తుఫాన్ గండం పొంచి ఉంటుందని ఐఎండీ (IMD) అంచనా వేసింది. గురువారం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.