అలనాటి అతిలోక సుందరి దివంగత శ్రీదేవి (Sridevi) మరణంపై ఆమె కుమార్తె, బాలీవుడ్ యువ నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో జాన్వీకపూర్ తన తల్లి మృతి గురించి మాట్లాడింది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయానని చెప్పుకొచ్చింది. ఆ బాధ నుంచి కోలుకునేందుకు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందన్నారు.జాన్వీ తన తొలి చిత్రం ధడక్ (Dhadak) కోసం వర్క్ చేస్తున్న సమయంలో శ్రీదేవి మరణించారు. ‘ఆ సమయంలో నేను ధడక్ సినిమా షూటింగ్లో ఉన్నాను. ఆమె లేని లోటు ఎవ్వరు తీర్చలేనిది. ఆ నాటి పరిస్థితులను ఎదుర్కొనడం కష్టంగా ఉండేది. ఆ సమయం ఎలా గడిచింది అన్నది అస్పష్టంగా ఉందినాకు సరిగా గుర్తులేదు. ఏమైనప్పటికీ ఆ నెల మొత్తం నాకు ఏమీ అర్థం కాలేదు.
చాలా కాలం పాటు అలాగే ఉంది. ఏదో ఒక పని చేస్తూ జీవితంలో ముందు సాగడం కష్టంగా అనిపించింది. ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు పెద్ద యుద్దమే చేశా.’అని జాన్వీకపూర్ తెలిపింది. 2018లో దుబాయ్ (Dubai) వేదికగా జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొన్న శ్రీదేవి.. అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.‘ధడక్’ సినిమాతో జాన్వీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మరాఠీలో సూపర్‌హిట్ అందుకున్న ‘సైరాట్’కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. తొలి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. వరుస సినిమాలతో ప్రస్తుతం సినీ ప్రియులను అలరిస్తున్నారు. తాజాగా ఆమె నటించిన ప్రాజెక్ట్ ‘బవాల్(Bawal)’. నితీశ్ తివారీ దర్శకుడు. వరుణ్ ధావన్ కథానాయకుడు. జులై 21న ఇది అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ‘దేవర’తో జాన్వీ నటిగా తెలుగులోకీ అడుగుపెడుతోన్న విషయం తెలిసిందే.