BJP MLA : మహాలక్ష్మి పథకం.. అలా చేస్తే బిచ్చమెత్తుకున్నట్లే అన్న బీజేపీ ఎమ్మెల్యే
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమైన ఈ పథకం..
BJP MLA : తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమైన ఈ పథకం.. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో 12 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా, ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 30 లక్షలకు చేరుకుంది. అయితే ఇదే అంశంపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. నెలకు రూ.10 వేలు ఆదాయం ఉన్నా.. ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకుంటే మహిళలు తమ దృష్టిలో బిచ్చగాళ్లలాంటి వారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీగా ఆదాయం, ఆస్తులు ఉన్నా పింఛన్, రైతు పెట్టుబడి సాయం, రేషన్ కార్డు తీసుకున్న వారంతా బిచ్చగాళ్లేనన్నారు. ప్రస్తుతం ఉచిత బస్సు సౌకర్యంపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘వెల్ సేడ్ ఎమ్మెల్యే’ అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తుంటే.. ‘నెలకు రెండున్నర లక్షలకు పైగా జీతం తీసుకుంటూ కూడా ప్రభుత్వ వాహనాన్ని వాడడం కూడా అంతే’ అని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.