అయోధ్యలో దీపోత్సవం వేడుకగా సాగింది. ఈ దీపోత్సవంలో 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు సాధించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు గిన్నిస్ ప్రతినిధులు సర్టిఫికెట్‌ను అందించారు.
దీపావళి సందర్భంగా అయోధ్యలో 22 లక్షలకు పైగా దీపాలు వెలిగించడంతో గిన్నిస్ రికార్డు నమోదైంది. శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో దీపోత్సవాన్ని నిర్వహించారు. వాలంటీర్లు అంతా కలిసి 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ ప్రతినిధులు దగ్గరుండి డ్రోన్ల సాయంతో పరిశీలించారు. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గిన్నిస్ ప్రతినిధులు గిన్నిస్ సర్టిఫికెట్‌ను అందించారు.
గిన్నిస్ సర్టిఫికెట్ తీసుకున్న సమయంలో అయోధ్యలో రామ నామం మార్మోగింది. సరయూ నది తీరంలో దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఎనిమిదేళ్లుగా దీపావళి సందర్భంగా సరయూ నది తీరంలో దీపోత్సవాన్ని ఎంతో వేడుకగా వాలంటీర్ల సాయంతో నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా గత ఏడాది వాలంటీర్లు 17 లక్షల దీపాలను వెలిగించారు.
ఈ క్రమంలో ఈ ఏడాది ప్రపంచ రికార్డును నమోదు చేసేందుకు యూపీ ప్రభుత్వం గట్టి ఏర్పాట్లు చేసింది. కేవలం 5 నిమిషాల పాటు మాత్రమే ఈ దీపోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో 25 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఐదు నిమిషాల్లోనే వారంతా సరయూ నది తీరం వెంబడి దీపాలను వెలిగించడం విశేషం. మొత్తం 51 ఘాట్లలో ముందే ఏర్పాటు చేసిన 24 లక్షల దీపాలలో 22.23 లక్షల దీపాలను వాలంటర్లీ వెలిగించి రికార్డు నెలకొల్పారు.