»Cpm Contest Single In Telangana Assembly Elections
Congressకు సీపీఎం రాం రాం.. ఒంటరిగా బరిలోకి, 17 చోట్ల పోటీ
కాంగ్రెస్ పార్టీతో సీపీఎం తెగ దెంపులు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేశారు. రెండు, మూడు రోజుల్లో 17 చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
CPM Contest Single In Telangana Assembly Elections
CPM Contest Single: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులు కలిసి వస్తారని.. ఉమ్మడిగా పోటీ చేస్తారని ప్రకటించారు. సీపీఐ, సీపీఎం (CPM) పార్టీలకు చెరో రెండు చొప్పున 4 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం వచ్చింది. కానీ ఆ తర్వాత దాని ఊసే లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కామ్రేడ్లకు సీటు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. దీంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (tammineni Veerabhadram) మీడియా ముందుకు వచ్చారు.
తెలంగాణలో ఒంటరిగా బరిలోకి దిగుతామని వీర భద్రం స్పష్టంచేశారు. 17 చోట్ల తమ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటన చేశారు. భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, భువనగిరి, హుజూర్ నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, ముషీరాబాద్‌లో సీపీఎం అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు. రెండు, మూడురోజుల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపారు.
కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ.. దేవుడు లేని దేవాలయంలా ఉంటుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుద్దాం అనుకున్నామని.. కానీ ఆ పార్టీ నేతల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఒంటరిగా బరిలోకి దిగడం బాధాకరంగా ఉందని.. అయినప్పటికీ తమ పార్టీ కోసం.. జనం కోసం బరిలోకి దిగుతున్నామని తెలిపారు. తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు గౌరవించి, ఆదరించాలని కోరారు.