కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అద్వైతాన్ని ప్రవచించిన ఆది శంకరాచార్యులతో పోల్చారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన మొదటి వ్యక్తి శంకరాచార్య అని గుర్తు చేశారు. ఆ తత్వవేత్త మాదిరి ఇప్పుడు రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. 19న జమ్మూ కాశ్మీర్‌లోని లఖన్‌పూర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. భారత్‌ను ఏకం చేయడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమన్నారు. ఈ యాత్రను వ్యతిరేకించే వారు దేశానికి, మానవాళికి శత్రువులన్నారు.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీని ఆదిశంకరాచార్యతో పోల్చడాన్ని బిజెపి తప్పు పట్టింది. హిందూ ఉగ్రవాదం, కాషాయ ఉగ్రవాదం పదాల సృష్టికర్త రాహుల్ అని, అలాంటి వ్యక్తిని ఇలా పోల్చడం ఏమిటని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాహుల్ యాత్ర కాశ్మీర్ చేరుకున్నది. ఈ సందర్భంగా రాహుల్ ట్వీట్ చేశారు. జోడోయాత్ర జమ్మూ కాశ్మీర్ చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. నా సొంతింటికి వచ్చిన భావన కలుగుతోందన్నారు. నా మూలాలు ఇక్కడే ఉన్నాయని చెప్పారు. మంచు కురుస్తుండడంతో రాహుల్ మొదటిసారి జాకెట్ ధరించారు.