ఆస్పత్రి బిల్ కట్టలేక, తమ చిన్నారిని వదిలేసి వెళ్లారు పేరంట్స్. నగదు సర్దుబాటు కాకపోవడంతో ఇంటి వద్దే ఉంటూ కుమిలిపోతున్నారు. ఈ ఘటన ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో జరిగింది.
Parents Who Could Not Pay The Hospital Bill And Abandoned The Child
Abandoned The Child: కార్పొరేట్ ఆస్పత్రి దోపిడీకి ఓ జంట కన్నీరు పెడుతోంది. ఆరోగ్యం బాగోలేని బిడ్డను హాస్పిటల్ చేర్పించారు. ట్రీట్మెంట్ అయ్యింది.. కానీ బిల్లు మొత్తం కట్టే స్థోమత లేదు. ఉన్న వరకు కట్టేశారు.. మిగతా నగదు తీసుకొస్తామని చెప్పి ఇంటికి వచ్చేశారు. అంత పెద్ద నగదు లేకపోవడం.. బిడ్డను తీసుకురాలేక చిత్రవధ అనుభవిస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున జరిగిన ఘటన ప్రతీ ఒక్కరినీ కలచివేసింది.
ప్రేమ పెళ్లి
ఐఎస్ సదన్ (IS Sadan) డివిజన్ సింగరేణి కాలనీ రోడ్ నంబర్ 14కు చెందిన నితిన్, రవళిక ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల నుంచి సహకారం లేదు. సో.. కూలీ పని చేసుకుని జీవిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన వారి పండండి పాప జన్మించింది. దీంతో తమ ఇంట లక్ష్మీ జన్మించిందని భావించారు. కానీ కాసేపటికే ఆరోగ్యం బాగోలేదు. దీంతో నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్ ద్వారా వైద్య చికిత్స అందజేశారు. హెల్త్ కండీషన్ మెరుగుపడ్డాక ఇంటికి పంపించేశారు.
మళ్లీ ఆస్పత్రికి..
ఇంటికి వచ్చిన తర్వాత సమస్య తిరగబెట్టింది. పాప శరీరంలో మార్పు వచ్చింది. వెంటనే స్థానిక వైద్యుడిని (doctor) సంప్రదించారు. పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో.. పిసల్ బండలో ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించి, వైద్యం అందజేశారు. అక్కడ ట్రీట్మెంట్ జరిగి.. పాప కోలుకుంది. ఐదురోజుల క్రితం డిశ్చార్జ్ కూడా చేశారు. కానీ బిల్ (bill) రూ.1.16 లక్షలు వేశారు. ఆ బిల్ చూసి ఆశ్చర్య పోయారు. కూడబెట్టిన మొత్తం రూ.35 వేలు చెల్లించారు. మిగతా అమౌంట్ సర్దుబాటు చేస్తామని చెప్పి, ఇంటికి వచ్చేశారు. ఎంతకు నగదు దొరకలేదు. కూలీ నాలీ పనులు చేసుకునే వారికి అంత మొత్తం ఇచ్చేవారు కూడా లేరు.
నరకం..
చిన్నారి (infant) ఆస్పత్రిలో ఉండగా.. మళ్లీ అటు వైపు వెళ్లలేదు. చిన్నారిని తీసుకురాలేక, ఇంటి వద్ద ఉండలేక చిత్రవధ అనుభవిస్తున్నారు. జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. మనస్సున్న మరాజులు ఎవరైనా బిల్లు కట్టి తమ పాపను ఇచ్చేయాలని కోరుతున్నారు. ఘటనపై ప్రభుత్వం స్పందించి ఆ పసిగుడ్డును పేరంట్స్ వద్దకు చేర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
విద్య, వైద్యం
దేశంలో నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ప్రతీ ఒక్కరికీ ఉచితంగా అందజేయాలి. అప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. లేదంటే.. పేదలు ఎప్పటికీ పేదలుగానే.. ధనికులు ఎప్పుడూ ధనికులుగానే ఉంటారని మేధావులు హెచ్చరిస్తున్నారు. విద్య, వైద్యానికి సంబంధించి నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారే తప్ప.. ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు.