తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులు అయ్యారు. సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ కొత్త సీఎస్‌ను ఎంపిక చేశారు. రేసులో రామకృష్ణారావు, అరవింద్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం శాంతికుమారి వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది. ఆమె నియామకానికి సంబంధించి ఉత్తర్వులు రావడమే మిగిలి ఉంది. శాంతికుమారి 1989 బ్యాచ్‌ను చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో సీఎంవోలో పనిచేసిన అనుభవం ఉంది. 2025 ఏప్రిల్ వరకు శాంతికుమారి తెలంగాణ సీఎస్‌గా కొనసాగుతారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్ కుమార్‌ను తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేశారు. ఆయన ఈ నెల 12వ తేదీ లోపు ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో చేరాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసింది. సోమేష్ కుమార్ రేపటిలోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలి. కానీ ఆయన ఏపీకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వీఆర్ఎస్ తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన సీఎం కేసీఆర్ సలహాదారుడిగా కొనసాగుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజిన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన సీఎస్‌గా ఉన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. దీనిపై సోమేశ్ కుమార్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. క్యాట్ ఉత్తర్వులు జారీచేయగా సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఉన్నత పదవీ (సీఎస్)గా పనిచేశారు. క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ సవాల్ చేసింది. 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై వాదోప వాదనలు జరిగాయి. మంగళవారం సీజే జస్టిస్ భూయాన్ బెంచ్ తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించింది. టీఎస్ క్యాడర్ కేటాయింపు రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది. క్యాట్ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి కొనసాగింపును రద్దు చేసింది. 2019 డిసెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కొనసాగారు. ఆ తర్వాత శాంతికుమారి బాధ్యతలను చేపట్టబోతున్నారు.