అగ్రరాజ్యం వీసా మరింత ప్రియం కానుంది. ఇమ్మిగ్రేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజును భారీగా పెంచుతూ జోబైడెన్ సర్కార్ ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలు రూపు దాలిస్తే హెచ్1బీ, హెచ్2బీ, ఎల్1, ఓ1, ఈబీ5 ఛార్జీలు అమాంతం పెరుగుతాయి. అయితే ఇందులో ఎక్కువగా తమ ఉద్యోగులను అమెరికాకు పంపించే కంపెనీలు భరించేవే. ఈబీ5 వీసా అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి ఇస్తారు. వలసేతర, ఉద్యోగ ఆధారిత వీసా దరఖాస్తుల ఛార్జీలను భారీగా పెంచే అంశానికి సంబంధించిన ప్రతిపాదనలను యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) బుధవారం తమ వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది.
పెంచుతున్న ఫీజుకు సంబంధించి ప్రజాభిప్రాయం కోసం 60 రోజులు గడువు ఇచ్చారు. ఆ తర్వాత దీనిని అమలులోకి తెచ్చే అవకాశముంది. దరఖాస్తుల ప్రాసెసింగ్ ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఛార్జీల పెంపును ప్రతిపాదించినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ నిర్ణయంతో పెండింగ్ వీసాల సంఖ్య తగ్గుతుందని పేర్కొంది. 2016 నుండి వీసా దరఖాస్తు ఛార్జీల్లో మార్పులు చేయలేదు. ఆరేళ్ల తర్వాత వీటిని పెంచాలని ప్రతిపాదించారు.
పెట్టుబడితో ముడివడిన ఈబీ5 దరఖాస్తుల ఛార్జీ 3675 డాలర్ల నుండి 11,160 డాలర్లకు పెరిగే అవకాశముంది. హెచ్1బీ రిజిస్ట్రేషన్ 10 డాలర్ల నుండి 215 డాలర్లకు పెరగవచ్చు. హెచ్1బీ వీసా 460 డాలర్ల నుండి 780 డాలర్లకు, ఎల్1 460 డాలర్ల నుండి 1385 డాలర్లకు పెరగవచ్చు.