ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన భారత రాష్ట్ర సమితి(BRS) జాతీయ పార్టీగా మారడంతో ఇతర రాష్ట్రాలలో పార్టీ పటిష్టత, కార్యకలాపాలు, పోటీ తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలుత సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పార్టీ అనుబంధ విభాగాలు పుట్టుకు వచ్చాయి. త్వరలో ఏపీలో పార్టీ అధ్యక్షులు, ఇతర పదవులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మాజీ ఐఏఎస్, సీనియర్ నేత తోటు చంద్రశేఖర్‌ను బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడిగా నియమించనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మాజీ ఐఆర్టీఎస్ అధికారి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి, అనంతపురం జిల్లా టీజీ ప్రకాశ్‌తో పాటు పలువురు నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన తోట చంద్రశేఖర్ 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి, గుంటూరు లోకసభ సీటులో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుండి ఏలూరు లోకసభ అభ్యర్థిగా, 2019లో జనసేన నుండి గూంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. చంద్రబాబుపై ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ మాయ వైసీపీ 150కి పైగా స్థానాలు గెలిచినప్పటికీ, తోటను మాత్రం విజయం వరించలేదు. రావెల కిషోర్ బాబు 2014లో ప్రత్తిపాడు అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 2019లో జనసేనలో చేరి, అక్కడి నుండే పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. పార్థసారథి ఐఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి, జనసేనలో చేరి 2019లో అనకాపల్లి లోకసభకు పోటీ చేసి ఓడిపోయారు. వీరి నేడో, రేపో బీఆర్ఎస్లో చేరే అవకాశముంది.
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ఏపీ నేతలతో పాటు అక్కడి వారిపై తీవ్ర పదజాలం ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కేసీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతమేరకు ఆదరిస్తారనేది మున్ముందు చూడాల్సిందే. అయితే కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగానే బలమైన నేతల్ని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తోటను పార్టీలోకి తీసుకొని, ఏపీ బాధ్యతలు అప్పగించనున్నారని చెబుతున్నారు. ఏపీలో కాపు ఓట్లు చాలా కీలకం. పలు జిల్లాల్లో కాపు ఓటర్లు తీవ్ర ప్రభావం చూపుతారు. అందుకే చంద్రబాబు ఈ సామాజిక వర్గానికి చెందిన తోటకు బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.
అదే నిజమైతే ఈ ప్రభావం అన్ని పార్టీల కంటే ఎక్కువగా జనసేన పైన పడుతుందని చెబుతున్నారు. వైసీపీని రెడ్డి, టీడీపీని కమ్మ పార్టీగా చూస్తారు. కాపులకు గతంలో వంగవీటి రంగ, 2009లో చిరంజీవి వంటి బలమైన నేతలు కనిపించారు. అయితే నిలకడగా ఓ పార్టీ లేకుండా పోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన వైపు మెజార్టీ కాపులు చూస్తున్నారు. తాను ఏ కులానికి చెందినవాడిని కాదని పవన్ చెబుతున్నప్పటికీ, కాపులు మాత్రం ఆయనను తమ ప్రతినిధిగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఇక్కడ కాపు నేతకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే, ఆ ప్రభావం జనసేన పైనే ఎక్కువ అంటున్నారు.
అయితే ఈ వాదనను కొట్టి పారేసేవారు కూడా లేకపోలేదు. అలాంటిదేమీ ఉండదని, అసలు ఏపీ ప్రజలు కేసీఆర్‌ను ఇక్కడకు రానిస్తారా చూడాలని అంటున్నారు. ఉద్యమం సమయంలో ఇష్టారీతిన మాట్లాడిన ఆయనను ప్రజలు ఆమోదించే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఈ నేతలు ఏ పార్టీలో అవకాశం లేక ఉన్న పార్టీలో గెలిచే పరిస్థితి లేక, ప్రాధాన్యత లేక ఒక గుర్తింపు కోసం బీఆర్ఎస్లోకి వెళ్లడం తప్ప ఏమీ లేదంటున్నారు. ఆ పార్టీలో చేరిన వారు గెలవడం, ఓడిపోవడం, డిపాజిట్ రాకపోవడం మాట పక్కన పెడితే, కనీసం ఒక శాతం ఓట్లయినా పడతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వారు కేవలం తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం మాత్రమే వెళ్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.