లోకసభలో నిర్మలా సీతారామన్, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రూపాయి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి సభలో ప్రశ్నించారు. ఈ సమయంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తెలంగాణ నుండి వచ్చిన వారికి హిందీ అంతగా రాదని, అలాగే, తనకు కూడా హిందీ అంతగా రాదని, సరిగా హిందీ లేని ఈ ప్రశ్నకు, సరిగా రాని హిందీలోనే (నాకు హిందీ సరిగా రాదనే అభిప్రాయంతో) సమాధానం చెబుతానని అన్నారు. దీనిని రేవంత్ రెడ్డి కులం దిశగా మళ్లించి, రాద్దాంతం చేసే ప్రయత్నం చేశారు. ఈ అంశంపై కల్వకుంట్ల కవిత స్పందించారు.
నిర్మలా సీతారామన్ హిందీ గురించి కాకుండా, రూపాయి బలహీనపడటం గురించి మాట్లాడితే బాగుండేదని కవిత అన్నారు. బీజేపీ నాయకులు భాష గురించి మాట్లాడి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేయవద్దని, సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. నిర్మలా సీతారామన్ మొదటి నుండి తెలంగాణ వ్యతిరేకి అని, రాష్ట్రానికి నిధులు రాకుండా చేశారని ఆగ్రహించారు. ఇప్పుడు లోకసభలో తెలంగాణను అవమానించేలా భాష గురించి మాట్లాడారని మండిపడ్డారు.
ఇక్కడ నిర్మలా సీతారామన్ వారికి భాష సరిగా తెలియదని, అలాగే తనకు తెలియదని వ్యక్తిగతంగా రేవంత్ పైన కాస్త సెటైరికల్‌గా మాట్లాడారు. దీనిని రేవంత్ కులం దిశగా తిప్పే ప్రయత్నం చేశారని బీజేపీ కేడర్ విమర్శలు గుప్పిస్తోంది. అయితే తెలంగాణ ప్రజలు దీనిని అర్థం చేసుకున్నారని చెబుతున్నారు. ఇదే అంశంపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు స్పందించారు. ఈ వ్యాఖ్యలు నిర్మల అహంకారానికి నిద్శనం అన్నారు.