»Indian Real Estate Top List 2023 Dlf Chairman Rajiv Singh Hurun Rich List
Indian Real Estate:కింగ్..DLF ఛైర్మన్ రాజీవ్ సింగ్
DLF ఛైర్మన్ రాజీవ్ సింగ్(Rajiv Singh) అత్యంత సంపన్న భారతీయ రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు ఈ లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చుద్దాం.
స్థిరాస్థి వ్యాపార రంగంలో DLF ఛైర్మన్ రాజీవ్ సింగ్(Rajiv Singh) అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. రూ.59,030 కోట్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. GROHE HURUN ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్ 2023 జాబితాను ఈ మేరకు విడుదల చేసింది. ఈ లిస్టులో రూ.42,270 కోట్ల సంపదతో ముంబైకి చెందిన మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా గ్రూప్)కి చెందిన మంగళ్ ప్రభాత్ లోధా ఫ్యామిలీ రెండో స్థానంలో ఉన్నారు. బెంగళూరుకు చెందిన ఆర్ఎంజెడ్ కార్ప్‌కు చెందిన అర్జున్ మెండా & కుటుంబం రూ.37,000 కోట్ల సంపదతో జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.
GROHE HURUN 67 కంపెనీలు, 16 నగరాలకు చెందిన 100 మంది వ్యక్తులకు ర్యాంక్ ఇచ్చింది. ఈ జాబితా మార్చి 2023 నాటికి ఆయా వ్యక్తుల సంపదను ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్నవారిలో 61 శాతం మంది వారి సంపదలో పెరుగుదలను చూశారు. వారిలో 25 మంది కొత్త ముఖాలు కాగా, 36 మంది వారి సంపదను కోల్పోయారు. DLF ఛైర్మన్ సంపద గత ఏడాదిలో 4 శాతం క్షీణించింది. అయినా కూడా అతను ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని నిలుపుకోవడం విశేషం.
ఇక రూ.26,620 కోట్ల సంపదతో కె రహేజా కార్ప్‌కు చెందిన చంద్రు రహేజా & కుటుంబం నాలుగో స్థానంలో ఉండగా, హీరా నందానీ కమ్యూనిటీస్ వ్యవస్థాపకుడు నిరంజన్ హిరానందని (రూ.23,900 కోట్లు) ఐదు, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ వ్యవస్థాపకుడు జితేంద్ర విర్వానీ (రూ. 23,100 కోట్లు) 6వ స్థానాల్లో ఉన్నారు.
ఈ జాబితాలో అత్యధికంగా 37 మంది వ్యక్తులు మహారాష్ట్ర, 23 మంది ఢిల్లీ, 18 మంది కర్ణాటక నుంచి ఉన్నారు. నగరాల్లో 29 మందితో ముంబై అగ్రస్థానంలో ఉండగా, 23 మందితో న్యూఢిల్లీ, 18 మందితో బెంగళూరు రెండో స్థానంలో ఉన్నాయి.