గతుకులు.. కంకర తేలిపోవడం.. వర్షాలకు తెగిపోవడం.. భారీ గుంతలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రోడ్లపై కనిపించేవి. అస్తవ్యస్తమైన రహదారులతో (Roads) ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణం చేయాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రోడ్డెక్కితే నడ్డి విరుగుతుందనే భయంతో రోడ్లపై ప్రజలు రావడానికి జంకుతున్నారు. వైఎస్ జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చాక రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), జనసేన ఇతర పార్టీలు నిరసనలు వ్యక్తం చేశాయి. తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏపీ రోడ్ల పరిస్థితిపై నివ్వెర వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంత్రి కేటీఆర్ (KT Rama Rao) ఏపీలో పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ఎంపీ సోయం బాపూరావు (Soyam Bapu Rao) ఏపీ రోడ్ల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లా (Alluri Sitharamaraju District) కేంద్రం పాడేరులో (Paderu) ఆదివారం జనజాతి సురక్ష మంచ్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని ఆదిలాబాద్ (Adilabad) బీజేపీ ఎంపీ బాపూరావు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తాను పాడేరుకు వస్తుండగా రోడ్లతో ఎదుర్కొన్న ఇబ్బందిని పంచుకున్నారు. ‘ఏపీలో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. 80 కిలో మీటర్ల దూరం ప్రయాణించేందుకు మూడున్నర గంటల సమయం పట్టింది. ఏపీలో మరీ అధ్వాన పరిస్థితులు ఉన్నాయి’ అని అసహనం వ్యక్తం చేశారు. ‘ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి. పాడేరు ప్రజలు విశాఖపట్టణానికి ఎలా రాకపోకలు సాగిస్తున్నారో అర్థం కావడం లేదు. తెలంగాణతో (Telangana) విడిపోయిన తర్వాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణం. సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలి’ అని ఎంపీ బాపురావు డిమాండ్ చేశారు.